ఉపాధ్యాయుల సేవకు పరమార్థం ఎస్టీయూ : రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగు, డిసెంబర్31,తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రంలో వివిధ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిస్వార్థంగా సేవ చేస్తూ, అన్ని ఉపాధ్యాయ సంఘాలకు మాతృ సంఘంగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్న సంఘం ఎస్టీయూ (STU) మాత్రమేనని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో ఎస్టీయూ రాష్ట్ర సంఘం రూపొందించిన డైరీ, క్యాలెండర్ల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 79 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తూ, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిస్వార్థ సేవలు అందిస్తున్న సంఘం ఎస్టీయూనే అని తెలిపారు. మిగతా ఉపాధ్యాయ సంఘాలకు మాతృ సంఘంగా ఎస్టీయూ నిలుస్తోందని, ములుగు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను “తలలో నాలుకలా” ముందుండి పరిష్కరిస్తున్న సంఘం కూడా ఎస్టీయూనే అని ఆమె ప్రశంసించారు. అన్ని సంఘాల కంటే ముందుగా డైరీ, క్యాలెండర్లను రూపొందించి ఆవిష్కరించడం అభినందనీయమని పేర్కొన్న మంత్రి, ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే లా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్ కుమార్, జిల్లా కార్యదర్శి మంచర్ల టవి వీరభద్రం, ఆర్థిక కార్యదర్శి పోరిక శంకర్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ సోలం కృష్ణయ్య, ములుగు మండల అధ్యక్షుడు మహమ్మద్ హమీద్, ప్రధాన కార్యదర్శి డేగల శంకర్, తాడ్వాయి మండల అధ్యక్షుడు కందిక రాజు, కార్యదర్శి రస్ పుత్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






