ఓసీల సింహగర్జన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి
– తెలంగాణ ఓసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు
వెంకటాపురం, డిసెంబర్ 26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని రోడ్లు–భవనాల శాఖ అతిథి గృహం ఆవరణలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఓసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓసిసామాజిక వర్గంలో అగ్రకులాలతోపాటు పేద కుటుంబా లు కూడా ఉన్నాయని, అయినప్పటికీ ఇప్పటివరకు సరైన రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో ఓసి వర్గం వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసి వర్గంలోని పేదలకు రిజర్వేషన్లలో పెంపు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి 11 ఆదివారం సాయంత్రం 3 గంటలకు హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ‘ఓసీల సింహగర్జన’ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా, వెంకటాపురం మండల ఓసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు.





