ఆత్మకూరు మండలంలో దారుణ సంఘటన
ఆత్మకూరు, డిసెంబర్ 26, తెలంగాణ జ్యోతి : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తెలిసిన వివరాల ప్రకారం, మలకపేట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న అనూష (35)పై ఆమె భర్త రవి అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో అనూష అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం నిందితుడు ఆమెను హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వదిలి పరారైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరస్పర విభేదాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్న పోలీసులు, నిందితుడు రవిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.






