ప్రజాస్వామిక తెలంగాణకై పునరంకితమవుదాం
టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్
కాటారం,డిసెంబర్23,తెలంగాణజ్యోతి:మహాదేవపూర్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) రాష్ట్ర నాల్గవ మహాసభల కరపత్రాన్ని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ప్రజాస్వామిక ఉద్యమకారులపై నిర్బంధం, అక్రమ కేసుల బనాయింపులు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పోరాడారని, ఈ ఉద్యమంలో ఎన్నో ప్రాణత్యాగాలు జరిగాయని గుర్తు చేశారు. తొలి దశ ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు చురుకుగా పాల్గొని, పోలీసుల తూటాలకు వందలాది మంది విద్యార్థులు బలయ్యారని తెలిపారు. 1990లలో చిన్న రాష్ట్రాల అంశం జాతీయ అజెండాగా మారిన నేపథ్యంలో, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన విప్లవ పార్టీగా ఉన్న పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ ఆకాంక్షను బలపరిచే డాక్యుమెంట్‌ను విడుదల చేసిందని, అది ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులపై ప్రభావం చూపిందన్నారు. భువనగిరి, సూర్యాపేట, వరంగల్ డిక్లరేషన్లతో పాటు తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ స్టడీ ఫోరం వంటి సంస్థలు ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు నడిపాయని వివరించారు. ఈ క్రమంలోనే 2010 అక్టోబర్ 9న టీపీఎఫ్ ఆవిర్భవించి, పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేసిందని తెలిపారు. అమరులు గద్దర్, ఆకుల భూమయ్య, మద్దిలేటి నాయకత్వంలో టీపీఎఫ్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. చివరికి సుమారు 1400 మంది విద్యార్థి–యువజనుల ఆత్మబలిదానాలు, జైలు జీవితం, కేసుల అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. అయితే రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ప్రజాస్వామిక హక్కుల కోసం టీపీఎఫ్ నిరంతరం పోరాడుతూనే ఉందని, గత పదేళ్ల పాలనలో టీపీఎఫ్ నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం, అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లోనే ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో టీపీఎఫ్ రాష్ట్ర నాల్గవ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పునరంకితమవుతూ, యావత్ నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మరో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పీక కిరణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, నాయకులు గాండ్ర మల్లేష్, దారకొండ సూర్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.






