కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా వెంకటాపురంలో పల్లకి సేవ
వెంకటాపురం నూగురు, నవంబర్15, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం రాత్రి కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని దేవస్థానంలో వెలసి ఉన్న స్వామివారు పల్లకిపై అలంకారాలుతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఏకాదశి ప్రత్యేకోత్సవాల నేపథ్యంలో పట్టణ ప్రధాన వీధులలో కాగడాల వెలుగులు, సన్నాయి మేళాలు, మంగళ వాద్యాల నడుమ పల్లకి శోభాయాత్ర సాగింది. పల్లకి ప్రయాణం సాగుతుండగా భక్తులు గుమికూడి శుద్ధి జలంతో స్వాగతం పలికి, పసుపు–కుంకుమలతో, టెంకాయలతో స్వామివారికి సమర్పణలు చేసి అర్చకుల ఆశీర్వాదాలు పొందారు. ప్రధాన రహదారి ఇరువైపులా నిలబడ్డ భక్తులు, దుకాణదారులు పల్లకి సేవను భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడి మధ్య పల్లకి సేవ విశేషంగా ఆకట్టుకుంది.





