మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
– డీఈఓకు వినతిపత్రం అందజేత
ములుగు, నవంబర్ 15, (తెలంగాణ జ్యోతి): మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యల పరిష్కార నిమిత్తం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ వంట కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, అల్పాహారం, కోడిగుడ్లు, వంట ఖర్చులు, వేతనాలు తొమ్మిది నెలలుగా చెల్లింపులేకుండా పెండింగులో ఉండటంతో వంటశాలలు ఎలా నడపగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ చేసిన రూ.10 వేలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియకపోవడం, పథకాన్ని ప్రైవేటు పరంగా మార్చే ప్రయత్నాలు కార్మికులకు ప్రమాదకరమన్నారు. ఒకే కూరకు మాత్రమే నిధులు ఇస్తూ రెండు కూరలు వండమని చెప్పడం, ఆరు రూపాయల కోడిగుడ్డుకి ఇచ్చి ఏడు రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వడ్డించమని చెప్పడం ఎలా సాధ్యమని అధికారులకు వివరించారు. దీనిపై స్పందించిన డీఈఓ, సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, జిల్లాస్థాయిలో అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, వంటకార్మిక సంఘం అధ్యక్షులు సామల రమ, ప్రధాన కార్యదర్శి గున్నాల రాజకుమారి, ఉపాధ్యక్షులు పోరెడ్డి ప్రమీల, మండల అధ్యక్షులు అంకం పద్మ, పౌర రాధ, మాలగాని కమల, జనగాం శోభ, ముద్దబోయిన భారతి, కడుముల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.





