భారీగా టేకు కలప పట్టివేత : రెండు వాహనాలు స్వాధీనం
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధి ఆలుబాక ప్రధాన రహదారిపై అక్రమంగా టేకు దుంగలను తరలిస్తున్న రెండు వాహనాలను అటవీ అధికారులు గురువారం వేకువజామున పట్టుకున్నారు. చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుండి అక్రమంగా టేకుకలపను తరలిస్తున్నారనే సమాచారంమేరకు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుద్దపల్లి వంశీకృష్ణ నేతృత్వంలో సెక్షన్, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంపు సిబ్బంది సహాయంతో గాలింపు చేపట్టి, రెండు పికప్ వాహనాలను ఆలుబాక వద్ద అడ్డగించారు. వాహనాల్లో మొత్తం 4.313 సి.మీ. టేకు కలప ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీని విలువ సుమారుగా రూ. 6.5 లక్షలు ఉంటుందని అంచనా. రెండు వాహనాలు సీజ్ చేసి, కలపను వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఈ దాడిలో ఆలుబాక సెక్షన్ ఆఫీసర్ చంద్ర మోహన్, ఎదిర సెక్షన్ ఆఫీసర్ జయ సింగ్, ఇతర బీట్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి చర్యలు ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు చేపడతామని ఎఫ్.ఆర్.ఓ వంశీకృష్ణ తెలిపారు.