ఏజెన్సీలో విద్యుత్ బిల్లుల షాక్
–ప్రజావాణిలో వినియోగదారుల పిర్యాదులు
ఏటూరునాగారం, మే 28, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ వినియోగ దారులకు అకస్మాత్తుగా భారీగా వచ్చిన విద్యుత్ బిల్లులు షాక్‌కు గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గృహవసరాల కోసం ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే గృహజ్యోతి పథకంను ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొమ్మిది నెలల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తూ వచ్చిన అధికార యంత్రాంగం, తాజాగా మే నెల బిల్లుల్లో ఒక్కసారిగా పాత బిల్లులు కలిపి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు లెక్కలు పంపించడంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ బిల్లులతో ఖంగుతిన్న ప్రజలు సంబంధిత ఎలక్ట్రిసిటీ శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాల్లో ఫిర్యాదులతో పోటెత్తుతున్నారు. ఒకవైపు ఉచిత విద్యుత్ పథకం ప్రకటించి, మరోవైపు ఏడాది మొత్తం బిల్లులు ఒకేసారి వసూలు చేస్తామంటే ఇది ఏ రకమైన న్యాయం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అర్థంకాని బిల్లుల లెక్కలు, సమంజసమైన వివరణ లేకపోవడం వల్ల సందేహాలు, అసహనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం తక్షణమే గమనించి, పునరాలోచన చేసి సరైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.