అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్థులను కూల్చివేయాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో వలస వచ్చిన గిరిజనేతరులు యదేచ్ఛ గా బహుళ అంతస్తుల భవనాలు,పుట్టగొడుగులవలె పుట్టుకొ స్తున్న వలస గిరిజనేతరుల యొక్క షాపింగ్ కాంప్లెక్స్ లు కడు తున్న గిరిజనేతరులకు, ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపించారు. ఆదివాసులకు అంద వలసిన హక్కులు, చట్టాలు,అభివృద్ధి ఫలాలను అందని ద్రాక్ష లాగా మింగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలకు గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ అధికారులు ఎలా అనుమతులు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై 1/70 (డి) ప్రకారం అక్రమ వ్యాపార దుకాణాలు, కాంప్లెక్స్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలను నిరోధించే అధికారం ఉన్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెవిన్యూ అధికారులు, గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటు వంటి స్ఫందన లేనందున జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకె ళ్తామని ఆయన అన్నారు. అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మించిన గిరిజనేతరులపై ఎల్.టి.ఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాటి రాంబాబు, బొగ్గుల పాపయ్య, సున్నం గోపాల్, పూనేం సూర్యం, తదితరులు పాల్గొన్నారు.