వైద్యురాలి పై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి
– మహాదేవపూర్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిరసన
మహదేవపూర్, తెలంగాణ జ్యోతి : వైద్యురాలి పై అత్యా చారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మహాదేవపూర్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిరసన తెలియ జేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా ఆర్ జి కార్ మెడికల్ కళాశాలలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మౌమిత డెబనాథ్ (31) పై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 8న జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటనను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం తీవ్రంగా ఖండించింది. దోషులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో నినదించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శని వారం మహాదేవపూర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ సేవలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య డాక్టర్లు, సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఖండించారు. డాక్టర్ మౌమితపై జరిగిన దాడిలో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. అత్యవసర సేవలు మినహా సాధా రణ అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. డ్యూటీ డాక్టర్ విద్యావతి మాట్లాడుతూ వైద్యులపై, ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. మహిళల పట్ల జరుగుతున్న అమానవీయ దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. హెడ్ నర్సింగ్ ఆఫీసర్ వినయకుమారి మాట్లాడుతూ ఆసుపత్రులలో మహిళలకు, ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. ఆసుపత్రి వైద్య ఆరోగ్య ఉద్యోగుల ప్రతినిధిగా ఐసిటిసి కౌన్సిలర్ గాదే రమేష్ మాట్లాడుతూ డాక్టర్ మౌమిత పై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించారు. దోషులను కఠినంగా శిక్షించాలని లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఆసు పత్రి నుంచి శ్రీపాదరావు చౌక్ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ లు ధరించి, ప్ల కార్డులు చేత బూని, ముక్తకంఠంతో నినాదాలు చేస్తూ, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్సిం గ్ ఆఫీసర్ బాలమణి, నర్సింగ్ ఆఫీసర్లు, సిస్టర్లు, ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న వివిధ విభాగాలకు చెందిన కాంట్రాక్టర్లు, లేబరేటరీ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది, మినిస్టీరి యల్ సిబ్బంది, సానిటేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.