కష్టాల కడలిలో మిర్చి సాగు
– మిర్చి రైతుల కన్నీళ్ళకు భాధ్యులు ఎవరు ?
– తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు చిట్టెం ఆదినారాయణ.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మిర్చి రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పెరిగిన పెట్టుబడులకు తోడు చీడపీడలతో మిర్చి సాగు తలకు మించిన భారమవు తున్నది. దిగుబడులు పెంచడం కోసం పురుగు మందులు వాడకం పెరిగిందని తెలంగాణా రైతు సంఘం ములుగు జిల్లా అద్యక్షులు చిట్టెం ఆదినారాయణ అన్నారు. మంగళవారం వెంకటాపురంలో మిర్చి సాగు రైతుల కష్ట ,నష్టాలపై మీడియా కు ప్రకటన విడుదల చేశారు.భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల్లో హెచ్చుతగ్గులతో పొలాల్లో కీటకాలు వ్యాప్తి చెందాయి. అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని పట్టించు కున్న దాఖలాలు లేవు. అధికార యంత్రాంగం నుంచి సలహాలు, సూచనలు కూడా లేవు. దీనికితోడు ‘మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టు’ మిర్చి కొనుగోళ్లు బాగా క్షీణించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో శీతల గిడ్డంగుల్లో భారీగా మిర్చి నిలువ ఉండటంతో ధరలు బాగా తగ్గిపోయాయి. ఎమార్కెట్లో రాబడి అయిన మొత్తం సరుకు అమ్మకం కావడం లేదనిఅన్నారు. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సీజన్ కోసం మిర్చి సేద్యం తగ్గనున్నట్లు సంకేతాలు అందుతు న్నాయి. వాస్తవానికి గత కొంతకాలంగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో చాలామంది మిర్చి సాగుకి మొగ్గు చూపారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారు. దేశంలో మిర్చి పంట పండించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం గాను, తెలంగాణ రెండో స్థానంలోనూ ఉందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో గత కొన్నేండ్లుగా మిర్చి సాగు భారీగా పెరిగింది. మిర్చి సాగుకి అనుకూలమైన మెట్ట, రేగడి, ఎర్ర నేల భూములు తెలంగాణలో ఉండటం, సాగునీరు కూడా తక్కువగా పట్టడంతో మిర్చి సాగు భారీగా పెరిగింది. తెలంగాణలో వాణిజ్య పంటల్లో మిరపది అగ్రస్థానం. వరి, పత్తి తర్వాత ఎక్కువగా మిరప వైపు మొగ్గు చూపుతు న్నారు. పత్తిని తెల్ల బంగారంగా పిలిస్తే మిరపను ఎర్ర బంగారంగా పిలుస్తారు. మొక్కలు వేడి, తేమతో కూడిన వాతావరణం రెండిట్లోనూ వృద్ధి చెందుతాయి.పంట కాలం 210 రోజులే కావటం, 140 రోజుల నుంచి కాపు కాసి నాలుగైదు సార్లు కాపు రావటంతో 20 నుంచి 25 క్వింటాలు మిర్చి దిగుబడి వస్తుందని తెలిపారు. ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి మిర్చిపంట పండితే ,తమ కష్టాలు దూరమవుతాయని రైతులు ఆశ పడ్డారు. అయితే తామర పురుగు, నల్ల పురుగు, ఎర్రనల్లి, తెగుళ్లకు తోడు ప్రకృతి వైపరీత్యాలు, కారణంగా ధరలు పతనం వంటి అంశాలతో దిక్కుతోచని పరిస్థితుల్లో మిర్చి రైతులు పడిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ చర్యలు లేకపోగా కనీసం సానుభూతి కూడా చూపటం లేదని విమర్శించారు.గతేడాది మిర్చి సాగు చేసిన రైతులకు మొదట ఎల్‌నీనో వర్షబావ పరిస్థితిల వల్ల మొక్క సరిగా ఎదగలేదు. తర్వాత వచ్చిన పెను తుఫాను మిగ్ జామ్ తోటలు దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. రైతాంగం పంటను కాపాడుకోవడానికి అందినకాడికి అప్పులు చేసి పంట మీద పెట్టారు. ఇంత చేసిన దిగుబడి సగానికి సగం పడిపోయింది.తెగుళ్లు బాధలు తట్టుకోలేక మిరపను పీకేసి కొందరు కూరగాయలు, మొక్కజొన్న సాగు మొదలు పెట్టారు. కనీసం వ్యవసాయ అధికారులు తోటలవైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు.2022-23కు గాను రెండు లక్షల 76 వేల ఎకరాలు మిర్చి సాగు చేసి సుమారుగా 5.06 లక్షల టన్నులు దిగుబడి సాధించారని పంటల దీగుబడి గణాంక లెక్కలు చేబూతున్నాయని తెలిపారు..ఈ ఏడాది కాస్త అటూఇటుగా అంతే సాగైంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదనేది రైతులను వేదనకు గురిచేస్తోంది.
– అధికారుల సలహాలు శూన్యం..!
రాష్ట్రంలో మిర్చి పంటకు వేరుకుళ్ళు తెగుళ్లు, నల్ల తామర, మచ్చలు, కాయ కుళ్ళు, ఆకు ముడత, కొమ్మ ఎండు తెగులు సోకుతున్నాయి. చలికాలం ఆరంభం నుంచే తెగులు ఉధృతి ఉంటుంది. తెగులు నివారణకు నిర్దిష్ట పురుగుమందు లేకపోవడంతో ఇతర పంటలకు వాడే మందుల్ని రైతులు వాడుతున్నారని తెలిపారు. యాజమాన్య పద్ధతులపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పెద్దగా దిశ నిర్దేశం చేయకపోవడంతో, ప్రయివేటు కంపెనీలు లాభం కోసం అనేక రకాల పురుగుమందులను సిఫార్సు చేస్తుండటంతో వాటిని వాడి మరింత నష్టపోతున్నారు. బయోమందుల మీద ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో తక్కువ ధరకు తయారయ్యే మందులను అత్యధిక ధరలకు అమ్మడంతో రైతులు మీద మరింత భారం పడుతున్నది. ఈ మందుల నియంత్రణ మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకు పోవటం బాధాకరంఅనిఅన్నారు. అనేక సంవత్సరాలుగా ఒకే నేల లో మిర్చి పంట సాగు చేయడం, పంట మార్పిడి చేయకపోవడం, నేల బలం గురించి రైతుకి అవగాహన లేకపోవడం పంట నష్టాలను మరింత తీవ్రతరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.అలాగే జీవ నియంత్రణ మందులు వాడించడంలో ప్రభుత్వ వైఫల్యం, రైతుల అవగాహన లోపంతో రసాయన మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది. జీవ నియంత్రణ మందులు ప్రభుత్వం తక్కువ ధరకు జిల్లా కేంద్రాలలో సరఫరా చేస్తుంది. కానీ అది మొత్తం రైతాంగానికి సరిపడే విధంగా ఉండకపోవడంతో 150 రూపాయలకే ప్రభుత్వం ఇచ్చే జీవ శిలీంద్ర మందుని, బయట వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. దీని నాణ్యత మీద సరైన నమ్మకం ఉండదు. ప్రభుత్వం జీవ శిలింద్రాలను ఎలా వాడాలో అవగాహనా సదస్సులు పెడితే ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుందని కోరారు.
– విత్తనం దగ్గరినుంచే రైతన్నకు నష్టం
మిర్చి పంట ద్వారా లాభాలు అందుకుని అప్పులు తీర్చాల నుకున్న రైతన్న విత్తనం దగ్గర నుంచే నష్టపోతున్నాడు. రైతుల ఆశను అవకాశంగా తీసుకొని పలువురు డీలర్లు దళారులు రైతులకు బ్లాక్ మార్కెట్లో విత్తనాలు అంటగడు తున్నారని ఆరోపించారు.. పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని తెగులు తట్టుకుంటాయని కంపెనీ వత్తనాలు దొరకటం లేదంటూ రైతులను నమ్మబలికి డీలర్లు అమ్ముతున్నారు. రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు అవకాశంగా మల్చుకుంటున్నారు. విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తగిలించి డబుల్ రేటుకి అమ్ముతున్నారని ఆరోపించారు. సాధారణంగా కిలో విత్తనాలు 35 వేల నుంచి 50 వేలు ఉండే విత్తనాలను 1,20,000 దాకా పెంచి బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఎం.ఎన్.సి అని చెప్పుకునే కంపెనీలు 100 గ్రాముల విత్తనాలకు గాను 1500 విత్తనాలను లెక్కపెట్టి, కేవలం 70 గ్రాములు మాత్రమే రైతుకి ఇస్తున్నారు. దీంతో 30 గ్రాముల విత్తనాలను రైతు నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఒక కేజీ విత్తనాలు కొన్న రైతుకి 700 గ్రాముల విత్తనాలు మాత్రమే వస్తాయి. దీంతో రైతు మీద ఆర్థిక భారం పెరిగిపోతుంది. అలాగే నర్సరీల మీద నియంత్రణ లేకపోవడంతో వారు బ్రాండ్ పేరు చెప్పి సాధారణ విత్తనాలు వాడటం వల్ల. రైతాంగం భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇంత జరిగినా ప్రభుత్వా నికి చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఖమ్మం మిర్చి యార్డ్‌తో పాటు, వరంగల్ మిర్చి యార్డులో ఎక్కువగా మిర్చి అమ్మకాలు కొనుగోలు సాగుతాయి. కేశసముద్రం, హైదరాబాద్, మధిరలలో పాక్షికంగానూ కొనుగోళ్లు ఉంటా యి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న మిర్చి యార్డు దేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు. ఇక్కడికి తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మిర్చి అమ్మకానికి వెళుతుంది. గతంలో ప్రతిరోజు ఒక లక్ష క్వింటాళ్ల అమ్మకం జరిగేది. ఇప్పుడు లక్ష నుంచి రెండు లక్షల క్వింటాలు అమ్మకం జరుగుతుంది. వరంగల్, ఖమ్మం, మధిర ప్రాంతాల్లో ఉన్న మిర్చి నిల్వ కొరకు ఉన్న శీతల గిడ్డంగులతో పాటు అటు గుంటూరు నుంచి, చిలకరావుపేట ఇటు విజయవాడ వైపు వందకు పైగా శీతల గిడ్డంగులు ఉన్నాయి. రైతులు కంటే వ్యాపారులే లాభాల కోసం ఎక్కువ నిలవ బెట్టుకున్నారు. ఈ గిడ్డంగులు మీద ప్రభుత్వం ఎటువంటి పర్యవేక్షణ లేదు. యార్డులలోకి మిర్చి ఎక్కువగా రావడంతో వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి రేట్లు తగ్గిస్తున్నారు. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లు కూడా ఖాళీ లేకపోవడంతో ధరలు మరింత పతనావస్థకు చేరుకున్నాయి. ఖమ్మం, వరంగల్ మిర్చి యార్డులలో జెండా పాట ఒకటి ఉండగా, మార్కెట్ ధర మరొకటి ఉంటుంది. పైకి చెప్పే ధరకి రైతుకచ్చే ధరకు పొంతనే ఉండదు. మార్కెట్లు పాలకదారులకి, వ్యాపారులకి లాభదాయకంగా ఉన్న రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజా ప్రతినిధులు మంత్రు లు వచ్చినప్పుడు జెండా పాట అంతో ఎంతో పెరుగుతుంది. నలుగురు ఎంపిక చేసిన రైతుల దగ్గర మాత్రమే కొంటారు. ధర అమాంతం తగ్గించేస్తారు.నాణ్యత లేదంటారు కొన్నిసార్లు రైతుల సరుకు కన్నా వ్యాపారస్తులు సరుకుని అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. విదేశాలకు ఆఫర్లు లేవంటూ రైతుకి వ్యాపారస్తుల మధ్య కొలుగోలులో వ్యత్యాసం చూపెడు తున్నారు. దీంతో తీవ్రమైన నష్టం మిర్చి రైతాంగానికి జరుగుతుంది. ఒక్కొక్కసారి 5వేల రూపాయల ధరలు వ్యత్యాసం ఉంటుంది. జెండా పాట 20వేలు చూపెట్టి నాణ్యత లేదంటూ 12 వేలనుంచి 15 వేలకు లోపు ధరకు కొనుగోలు చేయడంతో సాగు దారులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. పంట కోత సమయంలో పంటపై తెగుళ్లు దాడి ఉంటే మార్కెట్ దళారుల దాడి, దోపిడీ ఎక్కువనేది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
— అంతర్జాతీయంగా మిర్చికి డిమాండ్ —
తెలంగాణలో పండే మిర్చికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నది. తక్కువ కారం ఉండే ఈ మిర్చిని లిక్విడ్ రూపంలో కారము ఘాటు ఇలా రకరకాలుగా ప్రాసెస్ చేసి ఏదో ఎక్కువ డిమాండ్ ఉంటే అక్కడికి ఎగుమతి చేస్తే రైతుకి మంచి రోజులు వస్తాయి. మనం పండించిన పంటను ఇక్కడే ప్రాసెస్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో రోజువారీగా కారం వినియోగం 93 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఏటా రాష్ట్ర అవసరాలకు వాడేది 33.950 మెట్రిక్ టన్నులు. మిగిలిన దాన్ని ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. భారతదేశ నుండి మిరప దిగుమతి చేసుకునే దేశాలు శ్రీలంక, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా సింగపూర్, మలేషియా జర్మనీ. మిరప ఉత్పత్తి చేసే దేశాలు భారత్, చైనా, పాకిస్తాన్, మెక్సికో, టర్కీ, బంగ్లాదేశ్. మిరప ఎగుమతి చేయడానికి భారతదే శానికి ఉన్న పోటీదారులు పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇంతటి డిమాండ్ ఉన్న మిర్చిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా వినియోగించుకోకపోవడంతో పాటు ఎగుమతి చేసే అవకాశం ఉన్నా పట్టించుకోకపోవడంతో రైతులు నష్టపోతు న్నారు. పైగా అమ్మేటపుడు తక్కువ రేటు, కొనేటప్పుడు మాత్రం ఎక్కువ రేటు ఉండటంతో మరింత అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కనీసం పంటకు తగిన ధర వచ్చే వరకైనా శీతల గిడ్డంగుల్లో దాచుకుందామంటే అవి కూడా వ్యాపారుల లే అవుతున్నాయి. ఇలా అనేక రకాలుగా మిర్చి రైతుల కంట్లో కారం కొడుతున్నది ప్రభుత్వం. పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం జాడే లేదు. ఇప్పటికైనా మిర్చి రైతులకు రాష్ట్ర సర్కార్ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టేం ఆదినారాయణ డిమాండ్ చేశారు.