కులం సర్టిఫికెట్ లు ఇప్పించండి మహా ప్రభో
– శ్రీరంగాపురం గిరిజనుల వినతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా సూరవీడు పంచాయతీ శ్రీరంగాపురం గ్రామానికి చెందిన గిరిజనులు కులం సర్టిఫికెట్ల కోసం ధరఖాస్తులు చేసుకున్న అధికారులు సర్టిఫికెట్లు జారీ చేయడంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం నుండి శ్రీరంగాపురంలో నివాసం ఉంటున్నామని అప్పటినుండి తమ కుటుంబాలకు ప్రభుత్వపరమైన గిరిజన పథకాలు మంజూరు చేసే వారని తెలిపారు. వెంకటాపురం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండగా ఎస్టీ కులం సర్టిఫికెట్ జారీ చేశారని గిరిజనులు మీడియాకు తెలిపారు. అయితే 2018 లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లా వేరుగా ఏర్పడడంతో తమకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు మీద ఇచ్చిన గిరిజన కులపత్రాలు, ఇతర ఆధారాలతో మీ సేవలో గిరిజన కులం సర్టి ఫికేట్ల కోసం ధరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్న సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుల నిమిత్తం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, కులం సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, నివాసపత్రాలు, రేషన్ కార్డులు ఎంతో అవసరం అని శ్రీ రంగాపురం గిరిజనులు మంగళవారం వెంకటాపురంలో మీడియాను కలిసి తమ గోడు వెళ్ళబుచ్చారు. కూలి నాలి చేసుకొని జీవనం సాగించే తమకు సర్టిఫికెట్ల కోసం ఆఫీసులు చుట్టూ తిరగలేక పోతున్నామని గోడు వెల్ల బోసుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ వెంటనే స్పందించి తగు విచారణ జరిపి తమకు సర్టిఫికెట్లు ఇప్పించి ఆదుకోవాలని శ్రీరంగాపురం గిరిజనులు పత్రికా ముఖంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు.