వెంకటాపురం బజ్జీ మిరపకాయలకు హైదరాబాదులో భలే గిరాకి.
– లారీల కొద్ది బజ్జీ పచ్చి మిర్చి సరఫరా.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో లావుగా వుండి, పొడుగు రకం బజ్జి పచ్చిమిరపకాయలు కు హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఇతర పట్టణాలలో గిరాకీ ఉండటంతో, కొంతమంది కంపెని ఏజెంట్లు రైతులు వద్ద నుండి బజ్జి మిరపకాయలను కొనుగోలు చేసి నగరాలకు లారీల ధ్వారా సరఫరా చేస్తున్నారు. సుమారు 6 అంగుళాల పొడవు, చేతి బొటనవేలు లావు తో నిగ నిగ లాడుతు న్న బజ్జీల పచ్చిమిరపకాయలు, నక్షత్రాల హోటల్స్ , రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇతర ఫుడ్ వెరైటీలలో కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిని నగర, పట్టణవాసులు కు వారి తినుబండారాల అబిరుచులకు అనుగుణంగా వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో కేవలం పచ్చిమిర్చి బజ్జి మిరపకాయలు పండించే రైతులు డిసెంబర్ మొదటి వారం నుండి మొదటి, రెండో కోతలు ప్రారంభించి, బజ్జి మిరపకాయలు ను కొనుగోలు చేసే ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. కిలో 22 రూపాయలు చొప్పున క్వింటాలుకు 22వందల నుండీ 24 వందలవరకు రూపాయలు చొప్పున ఏజెంట్లు, వ్యాపారులు రైతులు వద్ద స్పాట్ క్యాష్ విధానంతో కొనుగోలు చేస్తున్నారు. సాయంత్రం పూట లారీ లోడింగ్ చేసి తెల్లవారేసరికి హైదరాబాద్ మార్కెట్ కు , ఇతర పట్టణాలకు రవాణా చేస్తున్నారు. కాగా రైతులు రోజుకు 300 రూపాయలు చొప్పున కూలీలను పెట్టుకొని కాయలు కోసి ఏజెంట్లు ఏర్ఫటు చేసిన బస్తాలలో ప్యాకింగ్ చేస్తున్నారు. పూత, పిందె దశ నుండి కాయ తయారై మిరప పండు వరకు వచ్చే దశ వరకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కేవలం పచ్చిమిర్చి అమ్ము కోవటం వలన పెట్టుబడి తగ్గి ఎంతో కొంత లాభదాయకంగా ఉందని బజ్జి మిరపకాయల పచ్చిమిర్చి రైతులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, ఎకరానికి పచ్చిమిర్చి బజ్జి కాయలు 25 నుండి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నదని, ఆఖరి దశలో మార్కెట్ లేకపోతే పండు కాయలుగా ఎండుమిర్చికి కళ్లాల్లో ఆరబెట్టి మార్కెట్లకు సరఫరా చేస్తామని, ఆయా బజ్జి మిరపకాయల పచ్చిమిర్చి రైతులు తెలిపారు. ఈ మేరకు వెంకటాపురం మండలంలోని పాత్రా పురం, ఆలుబాక, వాజేడు, గుమ్మడిదొడ్డి ఇతర ప్రాంతాల్లో బజ్జి పచ్చిమిరపకాయల వ్యాపారం తో హైదరాబాద్ జంట నగరాలకు ,పట్టణాలకు మిర్చి రవాణా జోరుగా వ్యాపారం సాగుతున్నది. కారం తక్కువగా ఉండటంతో పాటు, నోరూరించే బజ్జీలకు ఉపయోగపడుతుందని, గృహస్తులు సైతం బజ్జీ మిరపకాలను కొనుగోలు చేసి ఇంట్లో పిండి వంటలకు వినియోగిస్తున్నారు. మరి కొంతమంది వినియోగదారులు బజ్జి మిరపకాయలను మజ్జిగలో నానబెట్టి ఎండబెట్టి మజ్జిగ మిరపకాయలుగా తమ భోజనంలో నంజు కొని ఒక వెరైటీగా వినియోగిస్తున్నారు.