ఆదివాసీలు అన్ని రంగాలలో ముందుండాలి
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం ప్రతినిధి : తాడ్వాయి అటవీ ప్రాంతంలో మొండియాలతోగు, జలగలంచ గుత్తికోయలు గుంపులకు లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ వివేకానందపురం లయన్ అజిత్ నాయర్ అధ్యక్షతన బ్లాంకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏటూరునాగారం అటవీ ప్రాంతం పప్కాపూర్ వద్ద గల కొమురంభీం నగర్ లో మూడు సంవత్సరాలుగా నడుస్తున్న లయన్స్ ఆదివాసీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్, దీపావళి సందర్బంగా నూతన వస్త్రాలను బహుకరించి కొమురంభీం వాసులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్బంగా క్లబ్ డైరెక్టర్ పింగిలి నాగరాజు మాట్లాడుతూ ములుగు అటవీ ప్రాంతంలో తమ క్లబ్ గత ఎనిమిది సంవత్సరాలుగా లక్షల విలువ గల సేవా కార్యక్రమాలు చెపడుతున్నదని, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ రోజు ఆదివాసీలతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆధునిక సమాజం పట్ల బిడియం లేకుండా అలాగే హైద్రాబాద్ ప్రాంత వాసులకు ఆదివాసీల జీవన స్థితిగతులు తెలిసేలా ఉండడానికి దోహదపడిందని తెలిపారు. ఆదివాసీ పిల్లలు విద్యావంతులై ఉన్నత పదవులు చేపట్టాలని, ఇక నుండి ప్రతి సంవత్సరం ముగ్గురు కొమురంభీం వాసులు ఎవరైనా ఉన్నత విద్య అభ్యాసనకు తమ క్లబ్ పూర్తి ఖర్చుతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు శైలజా నాయర్, మృదుల మోహన్, సురేఖ శ్రీరామ్, భావనా జైత్ర, హారబిందెర్ సింగ్, మారుతి ప్రసాద్, అమిత్ శర్మ, చంద్రశేఖర్, దుర్గారావు మరియు భుజాగుండ్ల మొగలి పాల్గొన్నారు.