శ్రీధర్ బాబు గెలుపు తథ్యం : ఊరూరా కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మంథని శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని, శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాటారం మండలంలో గురువారం దేవరామ్ పల్లిలో డిసిసి ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్నారెడ్డి, డాక్టర్ ఎలుబాక సుజాత, ఐత మధుసూదన్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు జావిద్ ఖాన్, మాజీ సర్పంచ్ లక్ష్మి తదితరులు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. శంకరంపల్లిలో కోలాటం ఆట పాటలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అంకుషాపూర్ గ్రామంలో మత పెద్ద ఇమామ్ ను కలిసి మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఇతోధికంగా సహాయం చేస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు లబ్ధి పొందడానికి అవకాశం గా ఉంటుందని భావించి మైనారిటీలు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి అందించాలని వారు కోరారు. చిదినపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో బలవంతంగా చేరారని, వారు తమ సొంత గూటి పార్టీ అయినా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, బండం వసంత రెడ్డి, మంత్రి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.