బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి నాగజ్యోతిని గెలిపించాలి

Written by telangana jyothi

Published on:

బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి నాగజ్యోతిని గెలిపించాలి

– ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 

– నన్ను గెలిపించండి.. సేవచేసుకొని మీరుణం తీర్చుకుంటా 

– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

తెలంగాణ జ్యోతి, నవంబర్ 28, ములుగు ప్రతినిధి : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నడిపించిన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి తమ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ కాల్పులు, ఎన్కౌంటర్లు మొదలవుతాయని స్పష్టం చేశారు. మంగళవారం ములుగులోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తమ అభ్యర్థి ఓడినా ములుగును జిల్లాగా, మున్సిపాలిటీగా, మల్లంపల్లిని మండలంగా, ఏటూరు నాగారంను డివిజన్ గా ఏర్పాటు చేసి అభివృద్ధి నిధులు మంజూ రు చేశారన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా అధికారంలోకి వచ్చాక పోడు, అసైన్ భూములకు పట్టాలు అందజేస్తామన్నారు. తాను ఎమ్మెల్సీగా మరో నాలుగు సంవత్సరాలు సేవలు అందిస్తానని, తన నిధుల నుంచి నియోజక వర్గ ప్రజల అవసరాలు తీర్చుతానన్నారు. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు గెలిపించారని, ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ సీఎం ఎవరో చెప్పలేని స్థితలో ఉన్నారని, వారిని గెలిపించి తెలంగాణను ఆగం చేయొద్దన్నారు. నియోజకవర్గ ఓటర్లు ఆలోచించి తమ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి గెలుపుకు తోడ్పాటునందించాలని కోరారు.

–  తూటాకు బలి కాలేదంటే ప్రజలకు సేవచేయాలన్నదే అమ్మవార్ల నిర్ణయం.. : బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి

నా తండ్రి బడే ప్రభాకర్ ను, సీఎం కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ములుగు ప్రజలకు సేవచేస్తానని, తాను ఎప్పుడో తల్లి కడుపులో ఉన్నప్పుడే బుల్లెట్ తూటాలకు బలికావాల్సింది, బతికి బయటపడ్డానంటే సమ్మక్క, సారలమ్మ తల్లులు ప్రజాసేవ చేసేందుకే నన్ను బతికించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే జిల్లాలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయన్నారు. వైద్యం అందని రోజుల నుంచి 400లపడకల ఆస్పత్రి వరకు ములుగు వచ్చిందంటే అందుకు కారణం బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. కొత్తగూడ, గంగారం, నియోజకవర్గంలోని ఆయా చెరువులకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చర్యలు తీసుకుంటానన్నారు. గిరిజనులకు అత్యధిక పోడుపట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ దేనన్నారు. 24గంటల కరెంటు అందించామని, గిరివికాస్ ద్వారా వందలాది మందికి బోర్లు వేయించి కరెంటు సరఫరా చేశామన్నారు. రామప్ప, లక్నవరం సరస్సు ఆయకట్టులో చివరి భూములకు కూడా సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఐటీ కంపెనీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తానన్నారు. బడే ప్రభాకరన్న బిడ్డను ప్రజలు ఆశీర్వదించాలని, ఈనెల 30న జరిగే పోలింగ్ లో తనకు ఓటేసి గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, సమ్మారావు, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, భూక్య దేవ్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now