జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తే ఆందోళనలు ఉదృతం చేస్తాం
-ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి
-జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు
తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామ శివారులో సర్వేనెంబర్ 14 లో జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలు తొలగించాలని చూస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి హెచ్చరించారు. శనివారం ఆయన పాలంపేట గ్రామంలోని జర్నలిస్టుల కాలనీకి చేరుకొని జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర జర్నలిస్టుల దేనని, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి కృషి చేసిన ఘనత సైతం వెంకటా పూర్ జర్నలిస్టుల దేనని పేర్కొన్నారు. అలాంటి జర్నలిస్టులు నేడు వెంకటాపూర్ మండలంలో దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా సాధనకై శ్రమించిన జర్నలిస్టులు అదే స్ఫూర్తితో నేడు ఇంటి స్థలాల కోసం శాంతియు తంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. అధికారులు జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి వాటికి పట్టాలు ఇవ్వాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పైగా జర్నలిస్టుల గుడిసెలను తొలగించేందుకు అధికార యంత్రాంగం కుట్రలు చేయడం సరికాదని అన్నారు. టూరిజం శాఖకు కేటాయించిన భూమి ఉన్నప్పటికీ జర్నలిస్టులు వేసుకున్న భూమి సైతం టూరిజం శాఖ దేనని తప్పుడు నివేదికలు సమర్పిం చేందుకు స్థానిక అధికారులు సిద్ధం కావడం సిగ్గు చేటని అన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని లేనిపక్షంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి గుడిసెలు వేసుకోవడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తితో వెంకటాపూర్ జర్నలిస్టులు ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు పూసల పవన్ కుమార్, నాయకులు బూస గణేష్ యాదవ్, గుర్రపు ప్రవీణ్, రెడ్డి శ్రీధర్, మంద సురేష్, జర్నలిస్టులు భేతి సతీష్, ఎనగందుల శంకర్, ఎండి రఫీ, బీరెల్లి రమేష్, బానోతు యోగి నాయక్, దండేపల్లి సారంగం గౌడ్, పోశాల చంద్రమౌళి గౌడ్, పిల్లలమర్రి శివరాం, ఎనబోతుల కృష్ణ, మునిగాల రాజు గౌడ్, గట్టు ప్రశాంత్, మామిళ్ళ సంపత్, కందికొండ అశోక్, మామిడిశెట్టి ధర్మతేజ, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.