ఘనంగా నాగుల చవితిపండుగ : పుట్టల వద్ద భక్తుల కోలాహలం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో నాగుల చవితి పండుగను ఘనంగా నిర్వహించు కున్నారు. శుక్రవారం నాగుల చవితి పర్వదినం కు ముందు నుండే ఇల్లు వాకిళ్లు శుభ్రంగా కడుక్కొని, ముత్యాల ముగ్గులు, రంగవల్లులతో గృహినులు అలంకరించుకున్నారు. పండుగకు రెండు రోజులు ముందు నుండే నాన్ వెజ్ వంటకాలను నిలిపివేశారు. ముత్యాల ముగ్గులు రంగవల్లులతో ఇళ్ళు వాకిళ్ళు అలంకరించుకొని, నాగల చవితికి స్వాగతం పలికారు. దీపావళి పండుగ సందర్భంగా వెలిగించుకున్న మందు గుండు సామాగ్రిలో కొంత భాగాన్ని మిగుల్చు కొని వాటిని నాగుల చవితి సందర్భంగా మందు గుండు సామాగ్రిని సైతం కుటుంబాలు పుట్టల వద్ద,ఇళ్ళ వద్ద వెలిగించుకున్నారు. గ్రామ పొలిమేరలలో ఉన్న పుట్టలలో నాగులమ్మ తల్లికి పుట్టకలుగుల నుండి, ఆవు పాలు తో చలివిడి, బెల్లం నువ్వులతో తయారు చేసిన ప్రసాదం, నాటు కోడిగుడ్లు ను ఆవుపాలతో కలుగుల నుండి జారవిడిచి, పసుపు కుంకాలతో మహిళలు కుటుంబాలు పుట్ట ల వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టల వద్ద వేకువ జాము నుండే సందడి నెలకొన్నది. గ్రామ పొలిమెరల్లో ఉన్న ఆయా గ్రామాల భక్తులు, రెండు రోజులు ముందు నుండే పుట్టల వద్ద పిచ్చి చెట్లు తొలగించి, శుభ్రం చేసి నాగులమ్మ తల్లి చల్లగా చూడాలంటూ కల్లాపులు జల్లి ముగ్గులు పెట్టి పుట్టలను అందంగా అలంకరించారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని అనేక గ్రామాలలో నాగుల చవితి పండుగ సంధ్ ర్భంగా పుట్టల వద్ద ప్రసాదాలు ను పుట్ట కలుగుల నుండి జార విడవటం తదితర భక్తురస కార్యక్రమాలు తో సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా పుట్ట ల వద్దనే పూజలు అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన నాగుల చవితి పండుగ సందర్భంగా రైతాంగ గ్రామాల్లో పిండివంటలు, పులిహార, వడపప్పు చలివిడి,పులగం ,క్షీరన్నాలతో గుమగులాడుతున్నాయి. ఈ సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ గుడి, బెస్తగూడెం గ్రామంలోని వినాయక స్వామి, వాజేడు మండలం రామాలయాలు అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా ఆవు పాలకు గిరాకీ ఏర్పడింది.