గిరిజనేతరుల సమస్యలపై అభ్యర్థులు స్పందించాలి
– ఐక్యవేధిక అధ్వర్యంలో గిరిజనేతరుల సమావేశం
– సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణ జ్యోతి, నవంబర్ 24, మంగపేట ప్రతినిధి : ఏజన్సీలో 50 శాతం గిరిజనులున్న ప్రాంతాలను మాత్రమే 1/70 చట్టాలను అమలు చేసి షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తించాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. 1961లో కేంద్రం నియమించిన దేబర్ కమీషన్ ఇచ్చిన నివేధికలో పేర్కొన్నారని కమీషన్ పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా మంగపేట మండలంలో 28 శాతం గిరిజనులున్న ప్రాంతంలో 1/70 చట్టాలను బలవంతంగా ప్రజలపై ప్రయోగించి రాజ్యాంగ ఉల్లంగనలకు పాల్పడుతున్నారని సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలో ఏర్పాటు గిరిజనేతరుల ఐక్య వేధిక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మండలంలో కనీసం 3వ వంతు కూడా లేని గిరిజనులు మెజార్టీగా ఉన్న గిరిజనేతరులపై చట్టాలను ప్రయోగించి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. గిరిజన తెగలలో లంబాడా, కోయ, గోండు, గొత్తికోయ, ఎరుకల, నాయకపు తెగలున్నాయని ఇందులో కూడా ఆయా తెగలలో జీవన విధానంలో వ్యత్యాసాలున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గిరిజనుల్లో లంబాడా తెగలు ఎక్కువగా అభివృద్ధి చెందారని వీరు మెజార్టీగా ఉన్న గిరిజనేతరులతో కలిసి జీవించడం కారణంగా అభివృద్ధి చెందారని అభిప్రాయపడ్డారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలున్నాయని 1961 దేబర్ కమీషన్ నివేదికలో ఆ ప్రాంతాల్లోని గిరిజనుల భూములకు సంబందించిన లావాదేవీలను నియంత్రించడానికి రెగ్యులేషన్ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినహా 9 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు గిరిజనుల భూములు గిరిజనులకే అమ్మకోడానికి కొనుక్కోడానికి చట్ట సవరణ చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రంగా 1/70, 5వ షెడ్యూల్డ్ చట్టాన్ని తెచ్చి షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనేతరుల భూములు అమ్మడానికి కొనడానికి వీల్లేదంటూ రాజ్యంగ విరుద్దంగా గిరిజనులు పోరాడుతున్నారని ఈ చట్టం ద్వారా మిగిలిన 9 రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అమలులో ఉన్న1/70 చట్టాలను పరిశీలించాలని గిరిజన సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ 1/70 చట్టాలను తెచ్చి భారత, రామాయణ కాలం నుండి కలిసి మెలసి జీవిస్తున్న ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలు సృష్టించి సమాజంలో అల్లోకల్లోలమైన పరిస్థితులను కలగజేయడానికి ప్రభుత్వమే దోహదం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రజలను కలిసి ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దమైన సమస్యలను సృష్టంచి షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజనేతరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసేలా ఉన్న 1/70ని వెంటనే సవరించాల్సిన అవసరం ప్రభుత్వంపైన ఉన్నదని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున రాజకీయ పార్టీలు, షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రాంతాల్లో ఎన్నికల్లో నిలబడి ఉన్న అభ్యర్థులు 1/70 యాక్టు రాజ్యాంగ విరుద్దంగా ఉన్నందున యాక్టు సవరించేందుకు గెలిచిన నాయకులు చట్ట సవరణకు అసెంబ్లీలో తీర్మాణం చేయించాలని డిమాండ్ చేశారు. మండలంలోని గిరిజనేతరులకు ఉన్న సమస్యలను ప్రభుత్వం తొందరగా పరిష్కరించి వారి భయాలను పోగొట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మండలంలోని 25 గ్రామపంచాయతీలకు చెందిన సుమారు 2 వందల మంది గిరిజనేతరులు పాల్గొన్నారు.