కొండాయి బ్రిడ్జి పునర్నిర్మిస్తాo : ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
తెలంగాణ జ్యోతి ,నవంబర్ 18, ఏటూరునాగారం : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిన కొండాయి బ్రిడ్జిని పునర్నిర్మి స్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో పాటు వరదల్లో ఇల్లు కూలిపోయిన మల్యాల, కొండాయి, కొత్తూరు గ్రామస్తులకు మోడల్ కాలనీ నిర్మించి ఇచ్చేందుకు నాగజ్యోతి ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం కొండాయి మల్యాల, కొత్తూరు, చిన్న బోయినపల్లి, ఏటూర్ నాగారం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే అనసూయ ప్రచార ఆర్బాటలే తప్ప వరదల్లో నష్టపోయిన వారికి చేసిందేమీ లేదన్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వమే చాలామంది ప్రజల ప్రాణాలను కాపాడిందని, సీతక్క మాత్రం ఏమీ చేయకుండా ఏడుపు పొడ బెబ్బలు పెట్టినట్లు ఆమె అన్నారు. 20 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న సీతక్క ఈ ప్రాంతానికి కనీసం సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదని, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడం కారణంగానే వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని నాగజ్యోతి ఆరోపించారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో ముందుండి ఫోటోలకు ఫోజులిచ్చి తానే అంత చేసినట్లుగా ప్రచారం చేసుకుందన్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మా నాన్న బడే నాగేశ్వరరావు పోడు చేయించాడని, మా తండ్రి సమానులైన కేసీఆర్ వాటికి పట్టా ఇచ్చినట్లు వెల్లడించారు. పోడుపట్టలతో పాటు పట్టా పొందిన రైతులకు రైతుబంధు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఇంకా రైతుబంధు రానివారికి ఎన్నికల తర్వాత రైతుబంధు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనేతరులకు కూడా పొడుపట్టాలు ఇచ్చేందుకు కేసిఆర్ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వెల్లడించారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిన బడే నాగేశ్వరరావు కూతురు బడే నాగజ్యోతి కేవలం నిస్వార్ధంగా సేవ చేసేందుకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూనూరి మహేష్, కాకుల మరి ప్రదీప్ రావు, కృష్ణ ప్రసాద్, మేడారం సమ్మక్క సారక్కల ప్రధాన పూజారి కాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.