“ఇసుర్రాయి” కథకు అంతర్జాతీయ గుర్తింపు.
వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకుడు, రచయిత, డాక్టర్: అమ్మిన శ్రీనివాసరాజు వ్రాసిన బాలల కథ “ఇసుర్రాయి” కి అంతర్జాతీయ స్థాయిలో స్థానం దక్కింది. శ్రమ విలువను వర్గీక రిస్తూ పిల్లల మనస్తత్వాలకు ఆలోచన విధానాలకు అన్వయించి వ్రాసిన ఈ కథ గతంలో, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు బాలల కథల పుస్తకంలో స్థానం లభించింది. ప్రస్తుతం ఏ.పి. లోని కడప కు చెందిన “జాని తక్కెడలశిల” ఈ కథను “ఎ హ్యాండ్ మిల్” పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. దీనితోపాటు మరో 19 కథలు గల పుస్తకం “టైని ట్రేజర్స్” పేరుతో అంతర్జాతీయ సంస్థ ప్రచురించింది.119 దేశాలలో కొనుగోలు చేయబడుతున్న ఈ ప్రసిద్ధ ప్రచురణ సంస్థ ప్రచురించిన పుస్తకంలో, ఒక మారుమూల మన్య సీమకు చెందిన రచయిత రచన స్థానం పొందటం ఒక అరుదైన విషయంగా పలువురు పేర్కొన్నారు. గతంలో డాక్టర్ అమ్మిన రాసిన కథ “అడవిలో అందాల పోటీ” ని 2010 – 2015 విద్యా సంవత్సరాల మధ్య, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి ఏడవ తరగతి విద్యార్థులకు తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా స్వీకరించారు. దానితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్రేతర పాఠ్యాంశ రచయితగా ఎంపికైన తొలి వ్యక్తిగా ములుగు జిల్లా వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు భాష ఉపన్యాసకులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు స్థానం సాధించారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తన కథ స్థానం సాధించడమే కాకుండా మంచి గుర్తింపు పొందడం పట్ల రచయిత డా:అమ్మిన శ్రీనివాసరాజు ఆనందం వ్యక్తపరిచారు.తమ ప్రాంత రచయిత కథకు అంతర్జాతీయ స్థాయిలో స్థానం లభించడం పట్ల ,వాజేడు మండల ప్రజలు తో పాటు అధికారులు, వాజేడు కళాశాల ప్రధానాచార్యులు, ఉపన్యాసక బృందం హర్షం ప్రకటించి అభినందనలు తెలియజేశారు.