యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
– వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
భూపాలపల్లి, జూలై 8, తెలంగాణ జ్యోతి : యువత చదువు తో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. మంగళవారం భూపాలపల్లి కృష్ణకాలనీ లోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన టీ-షర్ట్‌లను బాస్కెట్ బాల్ జట్టుకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి. చదువుతో పాటు యువత క్రీడలపై దృష్టి సారించాలి. త్వరలో గద్వాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో భూపాలపల్లి జట్టు అత్యుత్తమంగా ప్రదర్శన చూపించి ప్రథమ స్థానం పొందాలని ఆకాంక్షిస్తున్నాన న్నారు.
వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్సార్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతని , రాష్ట్రాన్ని సంక్షేమ యుగం వైపు తీసుకెళ్లిన గొప్ప నాయకుడని, రైతుల బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా ఎన్నో మానవతా కార్యక్రమాలు అమలు చేశారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన చూపిన దారిలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలనను కొనసాగిస్తున్నదని అన్నారు.