జంపన్న వాగులో యువకుడు గల్లంతు
తాడ్వాయి, సెప్టెంబర్ 7, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగులో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. జనగాం జిల్లా కురుమవాడ నెహ్రూ పార్క్ ప్రాంతానికి చెందిన కనిగంటి మనీష్ (25) అనే యువకుడు స్నేహితులతో కలిసి మేడారం దర్శనానికి వచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్ఎఫ్ (NDRF) బృందం ఐదు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.