విద్యుత్ కంచె తాకి యువకుడికి తీవ్ర గాయాలు
– పరిస్థితి విషమం, ములుగు తరలింపు
వెంకటాపురం నూగూరు మార్చి 18 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల పంచాయతీ సుడిబాక గ్రామానికి చెందిన మడప భాస్కర్ అనే యువకుడు విద్యుత్ కంచె తాకి తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భాస్కర్ మంగళవారం రాత్రి తమ పంట పొలాల వైపు వెళ్లగా, అడవి జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు కంచెను అనుకోకుండా తాకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పాటు రక్తస్రావం జరిగి అక్కడే పడిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని ద్విచక్ర వాహనంపై వెంటనే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్సులో రాత్రివేళ ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనలో కంచె తాకడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. కాగా, అడవి జంతువుల కోసం విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన వేటగాళ్లు మనిషి చిక్కుకున్న విషయం తెలుసుకుని అడవుల్లోకి పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






