ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న మహిళ అరెస్ట్
తెలంగాణజ్యోతి, జులై12, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో చిన్నబోయినపల్లి నుండి యువతకు గంజాయి అమ్మడానికి వస్తున్న మహిళను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ఏటూరునాగారం ఎస్సై రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాల సమీపంలో మోహరించారు. చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన నిఖత్ అనే మహిళ హన్మకొండ బస్టాండ్ వద్ద వాహదుల్ల అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి బస్సులో చిన్నబోయినపల్లికి చేరుకుని, అక్కడి నుంచి స్కూటీపై ఏటూరునాగారం వైపు వస్తుండగా పోలీసులు వై జంక్షన్ వద్ద ఆమెను అడ్డుకుని తనిఖీ చేశారు. తన వద్ద ఉన్న 230 గ్రాముల ఎండు గంజాయి, యమహా స్కూటీ, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని సీఐ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.