మార్కెట్ పరిసరాల్లో వ్యర్థాలేంటి..?
– మున్సిపల్ కమిషనర్ సంపత్ ఆగ్రహం
ములుగు ప్రతినిధి, జూలై16, తెలంగాణ జ్యోతి : ములుగు లోని కూరగాయల, మాంసం, చేపల మార్కెట్ లో వ్యర్థాలను విచ్ఛలవిడిగా పడవేయడంపట్ల మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ములుగులోని కూరగాయల మార్కెట్ పరిసరాలను పరిశీలించారు. ఇష్టారీతిన బహిరంగ ప్రదేశాల్లో పడవేసిన వ్యర్థాలను చూసి వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా మటన్, చికెన్, చేపల వ్యర్థాల వల్ల తీవ్ర దుర్గంధం వెద జల్లడంతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. నిత్యం ప్రజలు మార్కెట్ కు ఎలా వస్తారని, పలువురి నుంచి ఫిర్యాదులు అందుతున్నా యన్నారు. వ్యాపారులు వ్యర్థాలను శాస్త్రీయంగా మున్సిపల్ నిబంధనల ప్రకారం పడవేయాలని సూచించారు. వ్యర్థాల నిర్వాకం వల్ల దుర్వాసన, వ్యాధుల వ్యాప్తి, పర్యావరణ కాలుష్యం పెరుగుతాయని అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.