ఆరుద్ర కార్తెకు స్వాగతం – రైతుల్లో హర్షాతిరేకం
– గుర్రెవులలో ఆరుద్ర పురుగుల దర్శనం
కన్నాయిగూడెం, జూన్ 23, తెలంగాణ జ్యోతి : ఈ ఏడాది ఆరుద్ర కార్తె ఆదివారం నాడు ప్రారంభమై జూలై 6 వరకు కొనసాగనుంది. ప్రకృతి శోభను చూపించే ఈ ప్రత్యేక కాలాన్ని రైతులు ఎంతో ఆత్మీయంగా ఎదురుచూస్తారు. సకాలంలో వర్షాలు పడతాయని ఆశించి, తాము సాగుచేసే పంటలకు ఇది ఎంతో అనుకూలమని వారు నమ్ముతారు. ఆరుద్ర కార్తె ప్రారంభమైన మొదటి రోజే కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామంలో రైతులు ఆరుద్ర పురుగులను చూశారు. పొలాల్లో తిరుగుతూ కనిపించే ఈ ప్రత్యేక పురుగులు వర్షాకాలం సంకేతమని, ఇవి కనిపిస్తే విస్తారమైన వర్షాలు పడతాయని గ్రామస్థుల నమ్మకం. ఇటు మరికొన్ని గ్రామాల్లో కూడా ఆరుద్ర పురుగులు దర్శనమివ్వడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. “ఆరుద్ర పురుగు కనిపిస్తే మేం ఊపిరి పీల్చుకున్నట్లే… ఇక వానలొచ్చినట్లే” అంటూ రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.