బాలికల గురుకులంలో విద్యార్థినిపై వార్డెన్ చేతివాటం
వార్డెన్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా లోని ఎస్సీ బాలికల గురుకులంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని విచక్షణారహితంగా కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన విద్యార్థులు, ప్రతిరోజూ ఏదో ఒక సాకు చూపిస్తూ తమను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విచారణ నిర్వహించి నివేదిక సమర్పించగా, జిల్లా కలెక్టర్ మంగళవారం వార్డెన్ భవానిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కూడా పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. బాలికల భద్రతపై ఇటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరాయి.







