భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్
కాటారం అక్టోబర్ 8,తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత జరుగనున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్లు స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6 జడ్పిటిసి, 58 ఎంపిటిసి స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో గన్ పూర్, చిట్యాల, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్ల పల్లి, టేకుమట్ల మండలాలకు జరుగనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి జడ్పిటిసి లకు 6, ఎంపిటిసిలకు 19 మంది రిటర్నింగ్ అధికారులను నియమించి నట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్లు దూరం వరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశిం చారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలనీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఎలాంటి విరుద్ధ చర్యలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లుతో శాంతి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు అధికారులకు సూచించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ టెలికాప్టర్లో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఏ ఎస్ పి నవీన్ కుమార్, రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.