వెంకటాపురం – చర్ల రహదారికి త్వరలో మోక్షం
– రెండు వారాల్లో మరమ్మత్తులు ప్రారంభం
– బలహీన పడిన వంతెనలు పరిశీలన
– ఎస్. ఈ రాఘవరెడ్డి
వెంకటాపురం, జూలై 29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం-చర్ల ప్రధాన రహదారిపై మరమ్మత్తు పనులు రెండు వారాల్లో ప్రారంభమవనున్నట్లు రోడ్లు-భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాఘవరెడ్డితెలిపారు. మంగళవారం వెంకటాపురం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రహదారి రీకన్స్ట్రక్షన్ కోసం రూ.44 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ, సాంకేతిక మంజూరులు లభించగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడిం చారు. ఇప్పటికే గోతుల భర్తీకి రూ.2 కోట్లు మంజూరయ్యా యని, టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక రెండు వారాల్లో మరమ్మత్తులు మొదలవుతాయని తెలిపారు. వీరభద్రారం వద్ద కుక్కమాకు వంతెనపై హెవీ వాహనాలు, ఇసుక లారీల వల్ల వైబ్రేషన్ పెరిగిందని, ఆ వంతెనను పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రీయ రహదారి నెం.12పై 40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలను తరచూ తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. వెంకటాపురం-భద్రాచలం రహదారిలో గోతులు అధికమవడం వల్ల గత 45 రోజులుగా బస్సు సౌకర్యం నిలిచిపోయిందని, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు, బాలసాని వేణుతో పాటు ఇతరులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రహదారి తనిఖీ కోసం ఎస్.ఇ. రాఘవరెడ్డి, ఈఈ సాంసింగ్, డీఈ వెంకటరమణ విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.