గిరిజన భాషలతో యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ
– ఢిల్లీలో ఆవిష్కరించిన కేంద్రమంత్రులు
ములుగుప్రతినిధి, అక్టోబర్7, తెలంగాణజ్యోతి : వనదేవతలు సమ్మక్క, సారలమ్మల పేర్లు యూనివర్సిటీకి పేరు పెట్టడంతో పాటు మూడు గిరిజన భాషలను లోగోలో రూపొందించడం అద్భుతమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. ములుగులోని ఎస్ఎస్ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వైఎల్.శ్రీనివాస్, ఓఎస్డీ వంశీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసంలో యూనివర్సిటీకి సంబంధించిన లోగోను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ లోగోలో గోండు, బంజారా, కోయ భాషలతో మోటో రూపొందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లోగో చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉందని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించడంతో పాటు గిరిజన వారసత్వాన్ని తరతరాలకు అందించే మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. కాగా, లోగో విశేషాలను వివరించిన వీసీ శ్రీనివాసన్ లోగో బ్యాక్‌గ్రౌండ్ లో పవిత్రంగా భావించే పసుపు రంగు, సమ్మక్క, సారలమ్మ ప్రతిరూపాలైన గద్దెలు ఉన్నాయన్నారు. లోగో మధ్యలో సూర్యుడి ప్రతిబింబం తల్లుల నుదిటిపై ఉన్న కుంకుమ బొట్టులా ఉంటుందన్నారు. లోగోపై ట్రైబల్ కమ్యూనిటీలైన కోయ, బంజారా, గోండుల భాషల నుంచి మూడు పదాలను తీసుకున్నామని, కోయ పదమైన దుమ్(విద్య), బంజారా పదమైన జ్క్షాన్(వివేకం), గోండు పదమైన సుదరన్(అభివృద్ధి)లతోపాటు సంస్కృత శ్లోకం జ్ఞానం పరమమ్ ధ్యేయం పొందుపరిచామన్నారు.