పార్టీ బలోపేతమే గ్యానం సారయ్యకు నిజమైన నివాళి
– నాలుగో వర్ధంతి సభలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్
వెంకటాపురం, ఆగస్టు30, తెలంగాణ జ్యోతి : నిస్వార్థమైన కమ్యూనిస్టు నాయకుడు, చివరి శ్వాస వరకు ఎర్రజెండాను వీడని వ్యక్తి, పేద–పీడిత ప్రజల కోసం దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన నేత గ్యానం సారయ్యకు నిజమైన ఘన నివాళి అంటే వెంకటాపురం మండలంలో పార్టీని బలోపేతం చేయడం అవుతుందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో జరిగిన కామ్రేడ్ గ్యానం సారయ్య నాలుగో వర్ధంతి సభకు కుమ్మరి శ్రీను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, ఇతర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రవికుమార్, కృష్ణారెడ్డి లు మాట్లాడుతూ… మండలంలో ప్రజలకు, పార్టీకార్యకర్తలకు సుపరిచితమైన పేరు గ్యానం సారయ్యదని గుర్తు చేశారు. తునికిఆకు కట్ట రేటు, కూలి రేటు, జమీందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. నిర్బంధాలు, పెత్తందారీ వ్యవస్థల ఎదుట లొంగని యోధుడని కొనియాడారు. “ఏజెన్సీ లో ఎర్రజెండా ఎగర వేయడం మనం గ్యానం సారయ్యకు ఇచ్చే నిజమైన నివాళి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు సారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.రెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, ఎండి దావూద్, కొప్పుల రఘుపతి, వంకా రాములు, మండల కార్యదర్శి గ్యానం వాసు, నాయకులు చారి, మాణిక్యం తదితరులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.