ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం దెబ్బతిన్నది : టిపిసిసి
కాళేశ్వరం అవినీతికి నిదర్శనం : మహేష్ కుమార్ గౌడ్
ప్రభుత్వాలు వస్తాయి పోతాయి.. కాంగ్రెస్ పార్టీ శాశ్వతం..
కార్యకర్తలే పార్టీ బలం.. ప్రజలే అధికారానికి కారణం..
సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్లతో ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు
బీఆర్ఎస్ కుటుంబ పాలనపై తీవ్ర విమర్శలు
ములుగు, ఏప్రిల్ 11, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘట్టమ్మ దేవాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకోగా అక్కడ నాయకులు మహేష్ కుమార్ గౌడ్‌కు గజమాలతో ఘన సన్మానం చేశారు. అదే ఉత్సాహంతో ర్యాలీ కొనసాగుతూ లీలా గార్డెన్ వరకు చేరుకుని సమావేశ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్ర మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి పాల్గొని డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ శక్తిని చాటిచెప్పారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తాయి పోతాయ్ కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతమని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని స్పష్టం చేశారు. ప్రజలే అధికారానికి కారణమని, వారి నమ్మకంతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం రూ.600 కోట్లతో భూసేకరణ చేపట్టామని, ములుగు జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసినట్లు చెప్పారు. సమ్మక్క సారక్క జాతర అభివృద్ధికి రూ.200 కోట్లకు పైగా నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం అవినీతి పాలనకు నిదర్శనమని ఆరోపించారు. మామ–అల్లుడు అవినీతి వల్లే ఆ ప్రాజెక్టుకు ఈ గతి వచ్చిందని, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. దొడ్డు బియ్యం పేరుతో ప్రజల డబ్బులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బీజేపీపై కూడా విమర్శలు చేస్తూ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఎలాంటి లాభం చేకూరలేదని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టారని అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే పార్టీగా బీజేపీ ఉందని, రాష్ట్రంలో ఆ పార్టీకి స్థానం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల సర్వే నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్కపై ప్రస్తావిస్తూ ఒకప్పుడు తుపాకీతో పోరాడిన ఆమె ఇప్పుడు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100కు పైగా సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొంటూ నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులకు అభినందనలు తెలిపారు. జై హింద్, జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.









