గిరివాణిలో వినిపించిన గిరిజనుల గోసలు
అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
ఏటూరునాగారం, మార్చి 23, తెలంగాణ జ్యోతి: గిరిజనుల సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించిన గిరివాణి కార్యక్రమంలో గిరిజనుల గోసలు వెల్లువెత్తాయి. సోమవారం ఐటీడీఏ ఏటూరునాగారం సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి–గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర టి.ఎస్. స్వయంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. గిరివాణి కార్యక్రమానికి 130, ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ గృహాలకు విద్యుత్ లైన్లు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల వివాదాలు, పట్టా పాస్‌బుక్స్ మంజూరు, బోర్‌వెల్స్ ఏర్పాటు, గిరి వికాస్ పథకం కింద సౌకర్యాలు, గృహ నిర్మాణాలు, కరెంటు కనెక్షన్లు, నీటి సౌకర్యం, అక్రమ వలసల నివారణ, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆర్థిక సహాయం, పెండింగ్ బిల్లుల చెల్లింపులు వంటి పలు సమస్యలపై గిరిజనులు అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు, ఎల్టీఆర్ కేసులపై అధికంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఎస్డిసి కోర్టును వారానికి నాలుగు రోజులు మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు కోరిన మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి హామీ పథకం నిధులతో పాటు ఇతర వనరులను వినియోగించి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఐటిడిఎ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, ఎస్డిసి ప్రతాప్, డీడీ జనార్దన్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










