చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను గురుకులంగా మార్చాలి
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 5, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి వన్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురుకులంగా మార్చాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బెస్తగూడెం పంచాయతీ కొమరం భీమ్ కాలనీలో ఆదివాసులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం కేంద్రంగా ఈ ఆశ్రమ పాఠశాలను గురుకులంగా మార్చడం అవసరమన్నారు. ఉన్నత చదువులు అందుబాటులో లేక చాలామంది ఆదివాసి విద్యార్థులు పదవ తరగతికే పరిమితమవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ స్థాయి గురుకులం ఏర్పాటు చేస్తే గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యలో ముందుకు వెళ్లే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఆదివాసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిరుతపల్లి వన్ ఆశ్రమ పాఠశాలను తక్షణమే గురుకులంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆదివాసి విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాటి లక్ష్మయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.









