రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
– జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్
వాజేడు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాలను జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, కాంగ్రెస్ రైతు ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను వ్యవసాయ సీజన్లో ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింద న్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లక్ష రుణమాఫీ ఏకకాలంలో చేయకుండా నాలుగు దపాలుగా చేయడంతో రైతుకు ఎలాంటి ఉపయోగం లేక, అవి వడ్డీ రూపాన వెళ్లాయ న్నారు. ఎన్నికల హామీల ఆరు గారంటీలను ఒకటొకటిగా అమలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన కొనసాగిస్తుందని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు వంటి పథకాల అమలు చేయడమే కాక నేడు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇదే విధంగా మిగతా హామీలను కూడా ఒక్కటి ఒక్కటిగా నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు లక్షల రుణమాఫీ హామీని అమలు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ చిత్రపటానికి వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తల్లడి ఆదినారాయణ, చెన్నం ఎల్లయ్య, నరసింహ చారి, ధనిశెట్టి రాంబాబు, రాణి, మేకల రాంబాబు, కాలేశ్వరపు సర్వేశ్వరరావు, బుద్దేటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.