ములుగు జిల్లాలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
– పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు..
– మేడారంలో శాశ్వత పనులకు రూ.135కోట్లు
– మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క
– తెలంగాణ అవతరణ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి
ములుగు ప్రతినిధి, జూన్ 2, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించామని, తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయులు కీలకపాత్ర పోషించారని, సబ్బండ వర్గాల ఉద్యమాన్ని గ్రహించి కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ములుగు జిల్లా అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగులోని తంగేడు స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ పి.శబరీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ సంపత్ రావులతో కలిసి మంత్రి సీతక్క జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రగతి నివేదిక వినిపించారు. తదనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ దివాకర టీఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదలకు సంక్షేమ ఫలాలను అందించడానికి అర్హులను గుర్తించడం జరుగుతోం దన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ నిజమైన అర్హులకు ఇల్లు కేటాయించడం జరిగిందని, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిన వారి పేర్లు నమోదు కావడంతో నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం లేదని, ఈ విషయంపై ఈనెల5న మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామ న్నారు. ఇండ్లు మంజూరు కానీ నిరుపేదలు ఆందోళన చెంద వద్దని సూచించారు.రానున్న మేడారం మహాజాతరకు రూ.135 కోట్లతో పనులు చేపడుతున్నామని, ఇప్పటికే రూ.35కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరో రూ.100 కోట్లతో శాశ్వత పనులను నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
– పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని, రూ.6కోట్లతో అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పలు జంక్షన్ లలో సింబల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రూ.5కోట్లతో మేడారంలోని జంపన్న వాగుపై సుందరీకరణ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.కోటిన్నరతో ఏటూరు నాగారం మండల కేంద్రంలో రూ.కోటితో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాల వద్దకు తరలించడానికి చొరవ చూపి ఆ స్థలంలో క్రీడా మైదానం, వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేయాలని కలెక్టర్ కు సూచించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు స్థానిక యువతకు ఉపాధి మార్గాలను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ముందకు వెళ్తామ న్నారు. అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ కంటస్టంట్లను రామప్ప శిల్పాలు ఆకట్టుకున్నాయని, జిల్లా అభివృవద్ధిలో అధికారుల సేవలను మరవలేమన్నారు. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పేరుతో ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో తెలంగాణకు భగవద్గీతగా మారి తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మార్చే స్తుందని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డల కోసం రూ.500లకే వంట గ్యాస్, రూ.200ల లోపు యూనిట్లకు ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం, మహిళా సంఘాలకు రుణాలు.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మన్నారు.
రైతు రుణమాఫీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతు న్నాయని అన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈ నెల ఒకటో తేదీ నుండి ఆగస్టు వరకు మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు రాష్ట్రంలో కుల గణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయిం చిందని, ఒక సంవత్సరంలోనే రాష్ట్రంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్ని కులాల విద్యార్థినీ విద్యార్థులు ఓకే చోట విద్యాభ్యాసం చేయడానికి యంగ్ ఇండియా సమీకృత నిర్మించడం జరుగుతు న్నదని, నిరుపేదలకు సొంతింటి కల నిజం చేయాలన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నదని, గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించడం కోసం ఇందిరా సౌర గిరిజల వికాసం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ప్రపంచ సుందరీమణుల పోటీలను రాష్ట్రంలో నిర్వహించి విజయం సాధించడంతో పాటు 33 దేశాల సుందరిమణులు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి ఫిదా అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ భారతి చట్టం తెచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా పట్టాలు అందజేయడానికి చర్యలు తీసుకుంటు న్నామని, జిల్లాలో నూతనంగా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం వైద్యశాలల ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. గిరిజన అభివృద్ధి శాఖ, పంచాయ తీరాజ్ ఇంజనీరింగ్, రహదారులు భవనాల శాఖ ద్వారా పలు రకాల భవనాలను నిర్మించడంతో పాటు లింక్ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని, నూతన కలెక్టర్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అటవీ శాఖ ద్వారా జిల్లాలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ అరణ్య క్యాంప్, లక్నవరం జంగిల్ క్యాంప్, ట్రెక్కింగ్ మార్గాలు, బోగత జలపాతం, రాక్షస గుహలతో పాటు పలుచోట పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేసి దేశ విదేశాలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్ట మైన చర్యలు తీసుకుంటున్నారని, రానున్న రోజులలో జిల్లా అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని సీతక్క తెలిపారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలం ప్రారంభం కావడంతో జిల్లాలోని రైతులు లైసెన్సు కలిగిన విత్తన దుకాణంలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులకు అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి రైతు విత్తనాలు కొనుగోలు చేయగానే రసీదు తీసుకోవాలని సూచించారు. వ్యాపారులు లూజు విత్తనాలు అమ్మకం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు మొదటి దశలో 3500 మంజూరు కాగా ఐటీడీఏ పరిధిలో మరో 1500 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్, డిపిఆర్ఓ రఫిక్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.