సింజెంట మొక్కజొన్న రైతుల ఆవేదన
– మాకు నష్టపరిహారం అందించాలి
వెంకటాపురం, జులై 20, తెలంగాణ జ్యోతి : బహుళ జాతి మొక్కజొన్న సాగుచేసిన రైతులు దిగుబడి రాక పంట నష్టపరిహారం అందక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మండలాల మొక్కజొన్న పంట నష్టపోగా, బహుళ జాతి మొక్కజొన్న కంపెనీల నుండి ఆందోళనలు ఫలితంగా నష్టపరిహారాన్ని, కంపెనీల నుండి రైతులకు చెక్కుల ద్వారా పంపిణీ చేశారు . ఈనెల ఏడో తేదీన ములుగు జిల్లా వాజేడు లో బహుళ జాతి మొక్కజొన్న రైతులు పంట నష్టపరిహారం చెక్కులను మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ ఇతర అధికారుల ద్వారా చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. సింజెంట కంపెనీ ఆర్గనైజర్ వెంకటాపురం కేంద్రంగా భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం కనుకునూరు, రెడ్డిపల్లి, సింగంపల్లి, తదితర గ్రామాలు చెందిన సుమారు 70 మంది రైతులు 160 ఎకరాల్లో కంపెనీ మొక్కజొన్న విత్తనాలు అందించగా సాగు చేశారు. నకిలీ విత్తనాల కారణంగా ఎకరానికి టన్ను మాత్రమే దిగుబడి రావటంతో, రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. తాము తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం ఇప్పించాలని, వెంకటాపురం ఆర్గనైజర్కు పలుమార్లు చెప్పగా రేపు మాపు అంటూ నెలల తరబడి తిప్పుకుంటున్నారని, ఇంతవరకు తమకు నష్టపరిహారం అందలేదని, సుమారు 30 మంది రైతులు, ఆదివారం వెంకటాపురం మండల కేంద్రానికి వచ్చి, ఆర్గనైజర్ ను కలిసేందుకు వెళ్లగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని, రైతులు తెలిపారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో సింజెంటా కంపెనీ మొక్కజొన్న సాగు చేసి నష్టపరిహాం ఇప్పించాలని, గతంలోనే వినతి పత్రం అందజే శామన్నారు. అయినా కానీ ఇంతవరకు తమకు ఎటువంటి కష్టపరిహారం అందలేదని రైతులు తెలిపారు. తమకు న్యాయం జరగలేదని రైతుల పక్షాన కనుకునూర్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ ఆధ్వర్యంలో, వెంకటాపురం ఆర్గనైజర్ తో పంట నష్టపరిహారం విషయం మాట్లాడేందుకు రైతులు తరలివచ్చారు. ఆర్గనైజర్ నుండి స్పందన లేకపోవడంతో, సింజంట కంపెనీ మొక్కజొన్న సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన తమకు కంపెనీ నష్టపరిహారి ఇప్పించాలని, న్యాయం చేయాలని కోరుతూ వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు.