ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు ఇంగ్లీష్‌పై పట్టు సాధించాలి
– విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
– రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగు ప్రతినిధి, జులై 9, తెలంగాణ జ్యోతి : ప్రైవేటు పాఠశాలలకు సమానంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడేలా చేయాలని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. బుధవారం ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ, దిశా ఫౌండేషన్, ఈఎల్ఎఫ్ ఇంగ్లీష్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన “లెర్న్ టు రీడ్ – 90 రోజుల ప్రత్యేక కార్యక్రమం” రెండవ దశను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ దశలో ములుగు జిల్లాలోని 50 ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఆంగ్ల భాషపై అభిరుచి పెంపొందించుకోవాలని, ఉపాధ్యాయులు ఫౌండేషన్ అందిస్తున్న టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్‌ను ఉపయోగించి బోధనను ప్రభావవంతంగా చేయాలన్నారు. ఇంగ్లీష్ మాధ్యమంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం తరం బాధ్యతగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ, గతేడాది నిర్వహించిన మొదటి దశ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మంచి అభివృద్ధి కనిపించిందని, ఈ ఏడాది మరో 50 పాఠశాలల్లో దీనిని విస్తరిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, ఫౌండేషన్ పరస్పర సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, సెక్టోరల్ అధికారులు రమాదేవి, గుళ్ళపెల్లి సాంబయ్య, దిశా ప్రతినిధులు ఐశ్వర్య, మంజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
ములుగు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను కూడా ఇదే పాఠశాలలో చదివిన విషయాన్ని గుర్తు చేస్తూ, పేదరికం అడ్డు కాకుండా విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా 10 కంప్యూటర్లు అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం రూ.6 లక్షల నిధులతో నిర్మించనున్న 3 టాయిలెట్ బ్లాకులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, అధికారులు అర్షం రాజు, రమాదేవి, సాంబయ్య, జయదేవ్, వజ్జ తిరుపతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.