అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
– తరలివచ్చిన భక్తజనసంద్రం
వెంకటాపురం, జులై 10, తెలంగాణజ్యోతి : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క సేవయాత్ర, గిరిజన ఉత్సవాలను పురస్కరించుకుని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య, వేద పండితుల పర్యవేక్షణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కళ్యాణం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. గురువారం ఉదయం జరిగిన కళ్యాణ క్రతువు సమయంలో జై శ్రీరామ్,“జై జై శ్రీరామ్” అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం గిరిజన సాంప్రదాయాలతో, కొమ్ము నృత్యాలు, రేల డాన్సుల మధ్య స్వామివారి రథయాత్ర ఘనంగా నిర్వహించబడింది. పురవీధుల్లోని శోభాయాత్రకు భక్తులు జలాభిషేకంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను భద్రాచలం దేవస్థానం బుధవారం నుంచే వేగంగా చేపట్టింది. కళ్యాణం రోజున కళ్యాణ మండపాన్ని అందంగా అలంకరించి, అన్ని అనుబంధ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వెంకటాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ అజయ్, ప్రధాన అర్చకులు నల్లంధిగల్ ఆనందాచార్యులు, మంచిరాజు సత్యనారాయణ పాల్గొన్నారు. భద్రాచలం దేవస్థానం తరఫున సూపరింటెండెంట్ కే. శ్రీనివాసరావు, అసిస్టెంట్లు ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఆర్. శ్రీకాంత్, ఉప ప్రధాన అర్చకులు ఏ. రామాను జాచార్యులు, కే. విష్ణువర్ధనాచార్యులు, వేద పండితులు ఎం. రవికుమార్ శర్మ, ఎస్. వెంకటాచార్యులు, ఎస్. గోపాలా చార్యులు, రథసిబ్బంది, వంట స్వాములతో పాటు తదితరులు పాల్గొన్నారు.