శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పాము హల్‌చల్
సురక్షితంగా పట్టిన స్నేక్ క్యాచర్ – అడవిలో వదిలివేత
వెంకటాపురం, జూలై 30, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం పాము ప్రత్యక్షమై భక్తుల్లో కాస్త ఉద్వేగాన్ని రేపింది. ఆలయ అర్చకులు ఉదయ పూజల కోసం గర్భగుడి తలుపులు తెరిచే సమయంలో పాము కనపడింది. ఈ దృశ్యం చూసిన అర్చకులు వెంటనే భక్తులకు సమాచారం అందించగా, వారు అటవీ శాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ శ్రీ సర్వేశ్వరరావు ఆలయానికి చేరుకొని పామును అప్రమత్తతతో బంధించి, సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే, ఇది విషపూరిత జాతికి చెందిన పాము కాదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు ఆలయం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొన్నా, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వచ్చింది. అనంతరం ఆలయ పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి.