పత్తిపల్లిలో ఘనంగా ప్రారంభమైన సీత్లా భవానీ పూజలు
ములుగు, ఆగస్టు 13,తెలంగాణ జ్యోతి: ములుగు మండలం పత్తిపల్లిలో గోర్ బంజారాలు అత్యంత పవిత్ర ఆరాధనగా భావించే సీత్లా భవానీ సమేత సాతి భవానీ పూజలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాన్ని సేవాలాల్ గోర్ మాటి మళావ్ పత్తిపల్లి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసానికి అనుగుణంగా గ్రామ తండాలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య సాత్ భవానీ (ఏడుగురు భవానీ మాతలు) సీత్లా భవాని, మేరామా భవాని, తుల్జా భవాని, కేంకాళి భవాని, హింగ్లా భవాని, డోలాంగర్ భవాని, మంత్రాల్ భవాని విగ్రహాలను పూజారి కిషన్ మహారాజ్ చేతులమీదుగా గ్రామ పెద్దలు, మహిళల సమక్షంలో ప్రతిష్ఠించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించారు. సాంప్రదాయ భక్తి గీతాలు, నృత్యాలతో తండా వాతావరణం భక్తిమయంగా మారింది. తీజ్ పండగ ఆరంభాన్ని సూచిస్తూ గోధుమలను ఆవు, మేకల ఎరువులో నానబెట్టి, తీజ్ బుట్టలను కట్టారు. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ పండగకు ఇది శుభారంభంగా నిలిచింది.