Seetakka| తప్పుడుమాటలు మాట్లాడితే సహించేది లేదు

On: April 11, 2026 3:41 PM

Seetakka| తప్పుడుమాటలు మాట్లాడితే సహించేది లేదు

Seetakka| తప్పుడుమాటలు మాట్లాడితే సహించేది లేదు

కార్యకర్తలే కాంగ్రెస్‌కు అసలైన బలం

గ్రామాలకే వెళ్లి సమస్యల పరిష్కారం

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు

అవసరమైతే కోర్టుల దాకా పోరాటం

ఓటమి నేర్పిన పాఠాలతో ఎదుగుదల

పార్టీ బలోపేతానికి పిలుపు

ప్రజల మధ్య ఉండే వారే నిజమైన నాయకులు

ములుగు, ఏప్రిల్ 11, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో జరిగిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందిస్తూ తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, జిల్లా స్థాయిలో ఇలాంటి సమావేశానికి ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి కావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కార్యకర్తల కష్టమే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం అని స్పష్టం చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను గ్రామాలకే వెళ్లి అక్కడే పరిష్కరించే విధంగా మండలాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తామని, ప్రజలు జిల్లా కేంద్రాలకు రావాల్సిన అవసరం లేకుండా అధికారులను గ్రామాలకే తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి నాయకుడు గ్రామాల్లో తిరిగి ప్రజలతో మమేకం కావాలని, ప్రజల మధ్య ఉండి పని చేసిన వారే నిజమైన నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. పదవులు వచ్చినా ప్రజలకు అందుబాటులో లేకపోతే నాయకత్వానికి విలువ ఉండదని హెచ్చరించారు. తాను ప్రతి నెలా గ్రామాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటానని, ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటానని పేర్కొంటూ నాయకులు కూడా అదే విధంగా పని చేయాలని సూచించారు. కార్యకర్తలతో తనకు కుటుంబ బంధం ఉందని, కొన్నిసార్లు ఆవేశంలో మాటలు వచ్చినా అది తాత్కాలికమేనని, చివరికి అందరం ఒక కుటుంబంలానే ఉంటామని చెప్పారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలపై కోపం చూపించినా మళ్లీ ప్రేమతో చేర్చుకున్నట్లే పార్టీ కూడా ఒక కుటుంబమని వివరించారు. కార్యకర్తలు ప్రజల ఇళ్లలోకి వెళ్లి వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. తాను రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎదురైన ఓటమి తనకు ఎంతో నేర్పిందని, అదే విజయానికి దారి చూపిందని మంత్రి తెలిపారు. ఆ అనుభవంతోనే ప్రజల విశ్వాసం గెలుచుకున్నానని, మొదట గెలిచుంటే కార్యకర్తల కష్టం అర్థం కాకపోయేదేమో అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత స్వేచ్ఛగా, గౌరవంగా పని చేసే అవకాశం లభించిందని, రాష్ట్ర, జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మంత్రి సీతక్క, అలాంటి చర్యలను ఇకపై అసలు సహించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టులకు వెళ్లి పరువు నష్టం దావాలు వేస్తామని, ఇప్పటికే కొంతమందిపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఖండిస్తూ, కేంద్ర నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని వివరించారు. మొదట వచ్చిన కోటేషన్‌ను రద్దు చేసి తక్కువ ధరకు ఫోన్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. బస్సు ఉచిత ప్రయాణం, మహిళలకు రుణాలు, రైతులకు మద్దతు వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వాటిపై దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలకు అసహనం పెరుగుతోందని అన్నారు. మేడారం అభివృద్ధి పనులపై వచ్చిన విమర్శలను కొట్టిపారేస్తూ, లోపాలు ఉంటే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కొని పార్టీ ప్రతిష్టను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే వెంటనే స్పందించాలని, అవసరమైతే కేసులు పెట్టాలని సూచించారు. చివరగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజల విశ్వాసం గెలుచుకోవాలని పిలుపునిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!