అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు
వసతి గృహాల విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాటారం, డిసెంబర్ 31,తెలంగాణ జ్యోతి : రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి గ్రీన్ ఛానల్ విధానం ద్వారా ప్రతినెల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసు కోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బుధవారం కాటారం ఐడీఓసీ కార్యాలయంలో భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కో–ఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో వసతి గృహాల నిర్వహణ, సౌకర్యాలు, విద్యార్థుల వైద్య పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, విద్యార్థుల భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉత్తమ ఫలితాల కోసం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపట్టాలని, అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపరాదని, వసతి గృహాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి హాస్టల్కు ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించి డైట్, మెనూ, సంరక్షణను పకడ్బందీగా అమలు చేయాలని, అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి షీ–టీమ్ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వసతి గృహాల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వసతి గృహాల్లో సౌకర్యాలు, డైట్, కాస్మెటిక్ చార్జీల పర్యవేక్షణకు మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ శాఖలతో సమన్వయంగా నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, భూపాలపల్లి ఎస్పీ, ఐటిడిఎ పీఓ, కాటారం సబ్ కలెక్టర్, అదనపు కలెక్టర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






