ఆర్టీసీ బస్సు బైక్ ఢీ – ఒకరి పరిస్థితి విషమం
కాటారం, సెప్టెంబర్ 29, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం-మహాదేవపూర్ మార్గ మధ్యలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టిఎస్ 25 టీ 4668) హైదరాబాదు నుంచి కాలేశ్వరం వెళుతుండగా లూన బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని సబ్‌స్టేషన్ పల్లెకు చెందిన మాచర్ల మల్లేశం కూరగాయల చిరు వ్యాపారి తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న ప్రభావంతో లూన బైక్ బస్సు టైర్ల కింద నుజ్జునుజ్జు కాగా, మల్లేశం తలకు, భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని వంద పడకల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.