ఆర్ఎస్ఎస్ కు వందేళ్లు పూర్తి :1న కాటారంలో ఉత్సవాలు
కాటారం, సెప్టెంబర్ 29, తెలంగాణ జ్యోతి : రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆర్ఎస్ఎస్) కు విజయదశమి పండుగ నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలోని అయ్యప్ప దేవాలయంలో అక్టోబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీన్ని పురస్కరించుకొని ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. డాక్టర్ కేశవరావు బలిరాం హెగ్డీ వార్ 1925లో ఆర్ఎస్ఎస్ ను స్థాపించారనీ, సమరసత, సంఘటితం నినాదంతో భారతదేశ వ్యాప్తంగా సంఘం పనిచేస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా, వక్తగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ బాధ్యులు, పుర ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.