మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణపై సమీక్ష
హైదరాబాద్, జులై 19, తెలంగాణ జ్యోతి : మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై హైదరాబాద్ లోని సచివాలయంలో శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పీఓ చిత్ర మిశ్రా, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, ఆలయ పూజారులు, నిపుణులు హాజరయ్యారు. పూజారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు లేకుండా పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర వైద్య సేవలు, భద్రత, మీడియా సెంటర్ ల కోసం ప్రత్యేక వసతులు కల్పించే ప్రతిపాదనలు రూపొందించామని అధికారులు తెలిపారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారలమ్మల ఆత్మవిశ్వాసం ప్రతిఫలించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.