ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించిందని బంధువుల ఆందోళన
– ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
– ఆస్పత్రి వారు మోసం చేశారని ధర్నా
ములుగుప్రతినిధి,జూలై15,తెలంగాణజ్యోతి : ములుగులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తన భార్యకు గర్భసంచి ఆపరేషన్ చేయిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆపరేషన్ వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకుందని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బాధితురాలి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ములుగు పోలీసులు విషయం తెలుసుకొని వారితోమాట్లాడి ఆందోళన విరమింప చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో వైద్యుడు, ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త కేలోతు సుమన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామానికి చెందిన కేలోతు సంధ్యారాణికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో ములుగులోని ఏరియా ఆస్పత్రి పక్కన ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యుడు పరీక్షించి సంధ్యారాణికి గర్భసంచి సమస్య ఉందని, ఆపరేషన్ చేయాలని, లేనట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవు తాయని తెలిపారు. దీంతో మార్చి 12న ములుగులోని ఆస్పత్రిలో బాధితురాలిని జాయిన్ చేశారు. 13న వైద్యుడు గర్భసంచి ఆపరేషన్ చేయగా వికటించి మూత్రం లీకేజీ అవతుండటంతో కుటుంబ సభ్యులు వైద్యుడిని నిలదీశారు. అయితే తన ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని, హన్మకొండలోని కళ్యాణి ఆస్పత్రికి రావాలని తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ములుగులో వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆపరేషన్ ఫెయిల్ అయ్యిందని తేలింది. ఈ విషయాన్ని సదరు వైద్యుడే తన నిర్లక్ష్యం వల్లే ఆపరేషన్ సక్సెస్ కాలేదని, గొడవ చేయొద్దని బాధితురాలితోపాటు తన భర్తను ప్రాధేయపడ్డాడు. అందుకు అంగీకరించిన తక్షణ చికిత్స చేయించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొద్దిరోజులకే బాధితురాలు సంధ్యారాణి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వరంగల్ ఎంజీఎం, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించగా పలు స్కాన్ లు చేయించ డంతో గర్భసంచికి ఉన్న ట్యూబులు తీయడంతోనే మూత్ర నాళం ఇన్ఫెక్షన్ అయ్యిందని తేలింది. దీన వలన మూత్రనాళం మూసుకుపోయి కిడ్నీ సైతం ఇన్ఫెన్కు గురైందని తెలిపారు. ఈ విషయాన్ని ములుగు లోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యునికి తెలియజేయగా ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించు కోండని, చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పి డబ్బులు అడుగగా ఇవ్వనని తేల్చిచెప్పినట్లు బాధితులు ఆరోపించారు. దీంతో మంగళవారం ములుగులో ఆందోళన చేశామన్నారు. ఈ విషయంపై వైద్య, పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితురాలి భర్త సుమణ్ ఫిర్యాదులో కోరారు.