క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు
– మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం, జూన్ 27, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ పార్టీలో క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేసే, ప్రజాభిమానాన్ని పొందిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని, పదవుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కాటారం మండలం మాలహార్ పరిధిలోని తాడిచర్ల గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ లింగాజీ, పరిశీలకులు చైర్మన్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్త లు శక్తిని వినియోగించాలని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని ఆయన స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రూపొందించిన సంస్థాగత ప్రణాళిక ప్రకారమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి వివరించారు. కాటారం, మాలహార్ మండలాల్లో మండల అధ్యక్ష పదవుల కోసం పలువురు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. తగిన అర్హత కలిగిన ఆశావాహులను ఎంపిక చేసి, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు. కృషి చేసే వారికి మాత్రమే పార్టీలో పదవులు లభిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయ కులు కోట రాజబాబు, వేమునూరి ప్రభాకర్ రెడ్డి, పంతకాని సమ్మయ్య, వోన్న వంశవర్ధన్ రావు, చీమల సందీప్, కారెంగల తిరుపతి, తెప్పెల దేవేందర్ రెడ్డి, కుంభం రమేష్ రెడ్డి, గద్దె సమ్మిరెడ్డి, నాయిని శ్రీనివాస్, ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న, జాడి మహేశ్వరి, ఎలుబాక సుజాత, శకుంతల తదితర నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.