మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
– ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ 2025’ జాబితాలో స్థానం
కాటారం,ఆగస్టు13,తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. దేశ ప్రఖ్యాత అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. ఏఐ రంగంలో వినూత్న విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మరియు తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ముందుం డే రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పోషించిన పాత్రకు ఈ గుర్తింపు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. విధాన రూపకర్తల విభాగంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్‌పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షురాలు దేబజాని ఘోష్ తదితరులతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఎంపికయ్యారు.ఏఐ రంగంలో తెలంగాణను రోల్ మోడల్‌గా నిలబెట్టడంలో శ్రీధర్ బాబు కీలకపాత్ర పోషించారని నిర్వాహ కులు ప్రశంసించారు. బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం ‘టెలంగాణ ఏఐ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్’ రూపొందించడం, దేశంలోనే తొలిసారిగా ‘ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్’ ప్రారంభించడం, గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణ వంటి కార్యక్రమాలు ఆయన నేతృత్వంలో జరిగాయి. 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించడం, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్‌అండ్‌డీ మరియు మానవ వనరుల అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ గౌరవం తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపేనని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం వల్లే ఈ స్థానం లభించిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణను ప్రపంచ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.